బిజినపల్లి తాండాలో పాలకవర్గం విస్తృత పర్యటన మౌలిక సదుపాయాలపై క్షేత్రస్థాయి పరిశీలన

పయనించే సూర్యుడు జనవరి 9 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే.శ్రవణ్ కుమార్ బిజినపల్లి మండల కేంద్రంలోని 14వ వార్డు పరిధిలో గల బిజినపల్లి తాండాలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఈరోజు విస్తృతంగా పర్యటించారు. తాండాలోని మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పాలకవర్గం, స్థానికులతో ముఖాముఖి చర్చలు జరిపి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని ప్రతి వీధిని సందర్శించిన సభ్యులు పారిశుధ్య పనుల పరిస్థితి, డ్రైనేజీ వ్యవస్థ పనితీరు, త్రాగునీటి సరఫరా విధానాన్ని నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వివరాలు సేకరించారు. ముఖ్యంగా డ్రైనేజీ పూడికతీత, వీధిదీపాల నిర్వహణ, తాగునీటి ఎద్దడి వంటి సమస్యలపై నివేదికలు సిద్ధం చేశారు. స్థానికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని పాలకవర్గ సభ్యులు హామీ ఇచ్చారు. అవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి తాండాలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మిద్దె ఇందిరా రాములు, ఉప సర్పంచ్ గడ్డమీది మహేష్, వార్డు సభ్యులు ఆలూరి గంగాధర్, పాత్లవత్ పాండు, ప్రజాప్రతినిధులు కంపిల్ల మల్లయ్య, జాజాల ఆంజనేయులు, ఇరుగంటి నరసింహ తదితరులు పాల్గొన్నారు.