పయనించే సూర్యుడు, జనవరి 09, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ తాత్కాలికంగా మత్తు కలిగించే ఆనందం కన్నా, జీవితంలో ఉన్నత స్థాయికి చేరి సమాజం నుండి లభించే గౌరవం కోటి రెట్లు గొప్పదని భద్రాచలం జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పి. శివ నాయక్ పేర్కొన్నారు.భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయ సేవలు ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “మత్తుమందుల అవగాహన, న్యాయ అవగాహన మరియు ఆరోగ్య సంక్షేమ మార్గనిర్దేశం” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.స్వామి వివేకానంద జయంతి సందర్బంగా జరుపుకుంటున్న జాతీయ యువజన దినోత్సవం వారోత్సవాల భాగంగా, జనవరి 5 నుండి 12 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సదస్సుకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. జాన్ మిల్టన్ అధ్యక్షత వహించారు.కార్యక్రమంలో భద్రాచలం జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దుర్గ భవాని, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదానం, శిశు మహిళా సంక్షేమ అధికారి రూప, న్యాయవాది తిరుమలరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ఎం. కిరణ్ కుమార్, బి. సుధాకర్ రావు, అధ్యాపకులు ఎన్. హిమజ, కపిల భారతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రసంగించిన న్యాయమూర్తులు మత్తు పదార్థాలు వ్యక్తిని, కుటుంబాన్ని మరియు సమాజాన్ని ఎలా దెబ్బతీస్తాయో వివరించి, విద్యార్థులు ఆరోగ్యదాయకమైన జీవనశైలిని అలవరచుకోవాలని సూచించారు.