చెరువు ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాల కలకలం!

★ నాగారం–రాంపల్లి చెరువు సర్వే నెం.393లో ఎలా వచ్చాయి అనుమతులు? ★ మున్సిపల్–విద్యుత్–ఇరిగేషన్ శాఖల పాత్రపై అనుమానాలు

పయనించే సూర్యుడు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ నాగారం జనవరి 10 ప్రతినిధి: ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రాంపల్లి చెరువు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) జోన్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని సర్వే నెంబర్ 393లో ఇళ్ల నిర్మాణాలు ఎలా చేపట్టారు? ఎఫ్‌టీఎల్ జోన్‌లో ఉన్న భూములకు అసలు ఏ జీవో ప్రకారం నిర్మాణ అనుమతులు ఇచ్చారు? అంటూ స్థానిక ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌లో ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఎవరిది? స్పష్టమైన ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెరువులు, కుంటలు, నాలాలు, వాటి ఎఫ్‌టీఎల్ మరియు బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదు. అలాంటిది నాగారం–రాంపల్లి చెరువు ఎఫ్‌టీఎల్ జోన్‌లో ఇళ్లు నిర్మాణం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు ఈ నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు ఏ జీవో ఆధారంగా అనుమతులు ఇచ్చారు? ఎఫ్‌టీఎల్ జోన్ కాదని నిర్ధారించేలా ఎలాంటి పత్రాలు సమర్పించారు? అన్న ప్రశ్నలకు ఇప్పటివరకు అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. ఎఫ్‌టీఎల్ ప్లాట్లకు కరెంట్ మీటర్లు ఎలా? మరోవైపు, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ప్లాట్లకు విద్యుత్ శాఖ అధికారులు ఏ ఆధారాలతో కరెంట్ మీటర్లు ఇచ్చారన్నది మరో పెద్ద ప్రశ్నగా మారింది. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ అప్రూవల్, స్థల స్వభావంపై క్లియర్ డాక్యుమెంట్లు లేకుండా విద్యుత్ కనెక్షన్లు ఎలా మంజూరు చేశారు? నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాలకు విద్యుత్ సరఫరా చేయరాదని తెలిసినా, అధికారులు కళ్లుమూసుకుని మీటర్లు ఇవ్వడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ ఏం చేస్తోంది? చెరువుల పరిరక్షణ బాధ్యత వహించాల్సిన ఇరిగేషన్ శాఖ పాత్ర కూడా అనుమానాస్పదంగా మారింది. ఎఫ్‌టీఎల్ సరిహద్దులు నిర్ణయించడం, అక్రమ కట్టడాలను గుర్తించడం, తొలగింపులకు సూచనలు ఇవ్వడం వంటి కీలక బాధ్యతలు ఇరిగేషన్ శాఖకు ఉన్నప్పటికీ, ఈ వ్యవహారంలో శాఖ పూర్తిగా మౌనం పాటిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువు ఆక్రమణలు జరుగుతుంటే ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ముడుపులిస్తే ఎక్కడైనా అనుమతులేనా? ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ముడుపులు చెల్లిస్తే చెరువు ఎఫ్‌టీఎల్‌లో కూడా అనుమతులు ఇస్తారా? అనే అనుమానం ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది. మున్సిపల్, విద్యుత్, ఇరిగేషన్ శాఖల మధ్య లోపాయికారీ ఒప్పందాలే ఈ అక్రమాలకు కారణమని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి: నాగారం–రాంపల్లి చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో జరిగిన అక్రమ నిర్మాణాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు, అక్రమంగా కరెంట్ మీటర్లు మంజూరు చేసిన విద్యుత్ శాఖ అధికారులు, అలాగే నిర్లక్ష్యం వహించిన ఇరిగేషన్ శాఖ అధికారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేసి, చెరువును పరిరక్షించాలని, లేదంటే ప్రజా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.