చైనా మాంజాపై నేరేడుచర్ల పోలీసుల కఠిన నిఘా

పయనించే సూర్యుడు జనవరి 10 నేరెడుచెర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్ ) సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరేసే సమయంలో చైనా మాంజా వాడకం వల్ల ప్రమాదాలు పెరిగే అవకాశం ఉండటంతో నేరేడుచర్ల మండల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మండల వ్యాప్తంగా నిషేధిత చైనా మాంజాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. మండలంలోని హుజూర్నగర్ రోడ్డులో ఉన్న శివదుర్గ షాప్ సహా పలు దుకాణాలను శుక్రవారం ఎస్‌ఐ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ చేశారు. చైనా మాంజా విక్రయం, నిల్వలపై ప్రత్యేకంగా పరిశీలించి, నిషేధిత వస్తువులు ఉన్నాయా లేదా అన్నది తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రవీందర్ మాట్లాడుతూ, చైనా మాంజా వల్ల పక్షులు, వాహనదారులు, చిన్నారులకు తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఈ మాంజాను పూర్తిగా నిషేధించిన నేపథ్యంలో, దాన్ని విక్రయించినా, కొనుగోలు చేసినా లేదా వినియోగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల ప్రజలు పండుగను సురక్షితంగా జరుపుకోవాలని, గాలిపటాలను సాధారణ దారాలతో మాత్రమే ఎగరవేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నిషేధిత చైనా మాంజా వాడకం వల్ల అనుకోని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశముందని . సంక్రాంతి పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ రవీందర్ కోరారు. మండలంలో ఎక్కడైనా చైనా మాంజా విక్రయం లేదా వినియోగం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు