పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 10 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో ముందస్తు మకర సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థినులకు రంగవల్లికల పోటీలను ఏర్పాటు చేయగా, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ కళా ప్రతిభను ప్రదర్శించారు. పాఠశాల ప్రాంగణం రంగురంగుల రంగవల్లికలతో కళకళలాడింది. సంక్రాంతి పండుగకు సంబంధించిన సంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింబించేలా విద్యార్థినులు వేసిన రంగవల్లికలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్ మాట్లాడుతూ, “విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. పండుగల ప్రాధాన్యతను తెలుసుకొని, మన సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని” అన్నారు. అనంతరం ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ బాలె నిఖిల్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని సంక్రాంతి శుభాకాంక్షలు పరస్పరం తెలియజేశారు. కార్యక్రమం ఉల్లాస భరితంగా కొనసాగింది.
