పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 10, మంథని నియోజకవర్గ ఇంచార్జి రమేష్, మంథని మండల కేంద్రంలోని ప్రాంతీయ పశు వైద్యశాల శిథిలావస్థకు చేరింది. ఇందులో పనిచేస్తున్న సిబ్బంది ప్రాణాల చేతిలో పెట్టుకొని భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. 10 సంవత్సరాలుగా దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్న చందంగా పశువుల దవాఖాన పరిస్థితి ఉంది. మాకు నూతన భవనం నిర్మించి ఇవ్వండి మహాప్రభో అని సర్కారుకు ఎన్నిసార్లు విన్నపాల ద్వారా మొరపెట్టుకున్న పట్టించుకునే వారే కరువయ్యారని సిబ్బంది వాపోతున్నారు. వ్యాధుల బారిన పడిన పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలను, కుక్కలను స్థానిక రైతులు, ప్రజలు తీసుకువచ్చి వైద్యం చేయించుకుంటారు. మంథని మండల కేంద్రంలో శిథిలావస్థకు చేరి అద్దె భవనాల్లో ఉంటున్న కార్యాలయాలలో పశువుల దవాఖాన కూడా చేరిపోయింది. ఇప్పటికైనా ఇక్కడి పాలకులు పట్టించుకుని నూతన భవనం మంజూరు చేయించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.