పయనించే సూర్యడు జనవరి 10 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల వార్షికోత్సవం శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథిగా సర్పంచ్ దున్న శ్రీనివాస్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు గురుకుల పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. గురుకుల విద్యను ఉపయోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో నడిగూడెం గురుకుల పాఠశాలకు మంచి పేరు ఉందని, పేరు ప్రతిష్టలు మరింత పెంచేలా విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠశాలలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నడిగూడెం గురుకుల పాఠశాలలో సీట్లు సాధించేందుకు విద్యార్థులు పోటీలు పడుతున్నారని అన్నారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నందున 100% ఉత్తీర్ణత సాధిస్తున్నట్లు తెలిపారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని సాధించేందుకు విద్యార్థులు కృషి చేయాలన్నారు. గురుకుల పాఠశాలను డిగ్రీ కళాశాలగా అప్ గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానన్నారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అప్ గ్రేడ్ చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి పాఠశాల నివేదిక చదివి వినిపించారు. ఎంతోమంది విద్యార్థులు చదువులో, క్రీడల్లో విజయాలను సాధించి జిల్లా, రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారన్నారు. పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నాగవరపు రాము, పేరెంట్స్ కమిటీ అధ్యక్షురాలు సుహాసిని, ఉపాధ్యక్షులు రవి, కోశాధికారి స్వాతి, మహిళా ప్రతినిధి గణిత సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ విజయ శ్రీ, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ సునీత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.