సిపిఎస్, నూతన జాతీయ విద్యావిధానం రద్దు చేయాలి

★ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి ★ టిఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో లంచ్ అవర్ నిరసన ప్రదర్శనలు

పయనించే సూర్యుడు జనవరి 10 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ ఉపాధ్యాయ ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సిపిఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, విద్యారంగాన్ని ప్రైవేటు కార్పొరేట్ చేతుల్లోకి నెట్టే నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని, అలాగే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా లంచ్ అవర్ నిరసన ప్రదర్శనలు నిర్వహించినట్లు తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వై. శ్రీధర్ శర్మ తెలిపారు. ఆల్ ఇండియా జాయింట్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దశలవారీ ఉద్యమాల్లో భాగంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. టిఎస్ యుటిఎఫ్ బిజినపల్లి మండల ప్రధాన కార్యదర్శి డి. ప్రభాకర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన లంచ్ అవర్ నిరసనలో పాల్గొన్న డాక్టర్ శ్రీధర్ శర్మ మాట్లాడుతూ, నాలుగు నెలల క్రితం గౌరవ సుప్రీంకోర్టు ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి అని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించినా ఇప్పటికీ సుప్రీంకోర్టులో పునఃసమీక్ష పిటిషన్ దాఖలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య తీవ్రతను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే క్రమంలో జనవరి 10న గౌరవ రాష్ట్రపతి, ప్రధాన మంత్రులకు పోస్టు ద్వారా వినతిపత్రాలు సమర్పిస్తామని, అలాగే ఫిబ్రవరి 5న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులను సమీకరించి ఢిల్లీలో ‘ఛలో పార్లమెంట్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల ప్రధాన కార్యదర్శి డి. ప్రభాకర్ మాట్లాడుతూ, చందాపై ఆధారపడిన ఎలాంటి సామాజిక, ఆర్థిక భద్రత లేని సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నూతన జాతీయ విద్యావిధానం స్థానంలో రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, శాస్త్రీయ దృక్పథంతో కూడిన ప్రత్యామ్నాయ విద్యావిధానాన్ని తీసుకురావాలని కోరారు. సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉపాధ్యాయులకు కనీస మూల వేతనం చెల్లించి వారి సేవలను క్రమబద్ధీకరించే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ పోరాటాల్లో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసన ప్రదర్శనలో అధ్యక్షులు వి రాములు.ప్రధాన కార్యదర్శి డి ప్రభాకర్. ఉపాధ్యాయులు రాధ, అలేఖ్యతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.