సెయింట్ థామస్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు

పయనించే సూర్యుడు జనవరి 10 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి సెయింట్ థామస్ పాఠశాలలో శుక్రవారం రోజున ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ & ప్రిన్సిపల్ ఫాదర్ శరన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ సంప్రదాయ పండుగల్లో సంక్రాంతి ఒక అత్యంత పవిత్రమైన, ఆనందభరితమైన పండుగ అని, పంటలు చేతికి వచ్చిన సంతోషాన్ని పంచుకునే ఈ పండుగ రైతుల శ్రమకు గౌరవం తెలిపే మహత్తర సందర్భం అని అన్నారు. ప్రకృతితో మన అనుబంధాన్ని గుర్తు చేసే పండుగగా సంక్రాంతి నిలుస్తుందనీ, ఈ పండుగ మనకు కష్టపడే తత్వం, సహనం, ఐక్యత వంటి విలువలను నేర్పుతుందన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడం, పెద్దలను గౌరవించడం, చిన్నారుల్లో మంచి సంస్కారాలను పెంపొందించడం వంటి గొప్ప లక్షణాలు ఈ పండుగ ద్వారా మనకు లభిస్తాయన్నారు. మన సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవడమే కాకుండా, వాటిని రాబోయే తరాలకు అందించడం మన బాధ్యత అని తెలిపారు. తదనంతరం భోగి మంటవేసి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన డాన్సులు, మన సంస్కృతిని తెలియజేసే ప్రదర్శనలు, గ్రామీణ వృత్తులు, సాంప్రదాయాలు వాటి విశిష్టత అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.