జూదం ఆడుతున్న ఆరుగురు అరెస్ట్ – నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం

పయనించే సూర్యుడు జనవరి 11 పాపన్నపేట మండలం రిపోర్టర్ దుర్గాప్రసాద్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ పాపన్నపేట. జనవరి. (పద్మక్రాంతి) ఈ రోజు నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ ఆదేశాల ప్రకారం, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి బృందం మెదక్ జిల్లా, పాపన్నపేట మండలం, కోత్తపల్లి గ్రామ శివారు పరిధిలోని అనంతపద్మనాభస్వామి దేవాలయం సమీపంలో అక్రమంగా హెడ్ అండ్ టెయిల్ జూదం ఆడుతున్న వారిపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వారు అరిగెల్ల చిన్ని, బందెల గోపాల్, ఉప్పరి వీరేశం, ఉప్పరి రమేష్, సాలె రాములు, నాగజోలా రమేష్. నిందితుల నుండి రూ.31,433/- నగదు మరియు 05 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న నగదు, మొబైల్ ఫోన్లు మరియు నిందితులను పాపన్నపేట పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ తదుపరి దర్యాప్తు మరియు చట్టపరమైన చర్యల నిమిత్తం అప్పగించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ మాట్లాడుతూ, జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జూదం, పేకాట, బెట్టింగ్ వంటి కార్యకలాపాల వల్ల అనేక కుటుంబాలు నష్టపోతున్నాయని, ముఖ్యంగా యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో తప్పుదారులను ఎంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడకుండా ఏదీ సాధ్యం కాదని, ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని జిల్లా ఎస్పీ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *