పయనించే సూర్యుడు జనవరి 11 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బీసీలు రాజకీయంగా ఎదిగినప్పుడే వారికి సామాజిక న్యాయం సమీపిస్తుందని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్, విశారాదన్ మహారాజ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు స్పష్టమైన హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. శనివారం బిజినపల్లి మండల కేంద్రంలోని ఎంజేఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీసీలకు కల్పించాల్సిన 42 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి న్యాయం చేయాలని అనేకసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో జరిగిన అనేక ఉద్యమాల ఫలితంగా ఇప్పటివరకు అగ్రవర్ణాలకే అధికారం దక్కిందని, ప్రస్తుతం కొనసాగుతున్న బీసీ ఉద్యమం రాష్ట్రంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా కొత్త మలుపు తిరుగుతుందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే ఓటు అనే ఆయుధం ద్వారానే సాధ్యమని స్పష్టం చేశారు. జనగణన చేయకుండానే బీసీల జనాభాపై అంచనాలు వేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. బీసీలు రాజకీయంగా, సామాజికంగా ఎదగాలంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను కలుపుకొని బలమైన రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పూలే ట్రస్టు అధ్యక్షులు బాలరాజు గౌడ్, పచ్చిపాల సుబ్బయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ పెబ్బేటి మల్లికార్జున్, బీసీ సంఘం మండల అధ్యక్షులు సత్యశీల సాగర్, జిల్లా అధ్యక్షులు అంతటి రాజేంద్ర గౌడ్, వెంకటస్వామి, బిసి ప్రధాన కార్యదర్శి బాల్ లక్ష్మయ్యతో పాటు పలువురు బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు.