కోడిపందాలు-జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు: ముమ్మిడివరం సీఐ యం.మోహన్ కుమార్

పయ నించే సూర్యుడు జనవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం: సంక్రాంతి పండుగ వేళల్లో కోడిపందాలు, పేకాట, గుండాటలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని యం. మోహన్ కుమార్, ముమ్మిడివరం సీఐ హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ముమ్మిడివరం సీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, సంక్రాంతిని సాంప్రదాయబద్ధంగా, కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. కోడిపందాలు, జూదం వంటి కార్యక్రమాలు చట్టవిరుద్ధమని, వాటిని నిర్వహించినవారితో పాటు స్థల యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు, అమలాపురం డీఎస్పీ టి ఎస్ ఆర్ కె ప్రసాద్ పర్యవేక్షణలో శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టామని చెప్పారు. ముమ్మిడివరం సర్కిల్ పరిధిలోని ఐ.పోలవరం, ముమ్మిడివరం మరియు కాట్రేనికోన మండలాల గ్రామాల్లో ఎక్కడైనా కోడిపందాలు–జూదం నిర్వహిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మూడు మండలాల సర్కిల్ పరిధిలో ఇప్పటివరకు సుమారు 150 బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రజలు సహకరించాలని, సమాచారం అందించాలని కోరారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: సీఐ, ముమ్మిడివరం : 9440796528 ఎస్సై, ఐ.పోలవరం ( ఎం. రవీంద్ర బాబు): 9440796540 ఎస్సై, ముమ్మిడివరం (డి. జ్వాలా సాగర్): 9440796564 ఎస్సై, కాట్రేనికోన (ఐ.అవినాష్): 9440900774 శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా ఎంతటివారైనా సరే చట్టప్రకారం చర్యలు తప్పవని సీఐ స్పష్టం చేశారు.