వైభవంగా త్రిశూలార్చన, నవకలశార్చన

పయనించే సూర్యుడు జనవరి 12 ఎన్ రజినీకాంత్:- హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలను అర్చక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఆలయంలో స్వామి వారి ఆయుధమైన త్రిశూలానికి విశేష అర్చనలు నిర్వహించి, లోక కల్యాణం కోసం ప్రార్థనలు చేశారు. అదేవిదంగా తొమ్మిది కలశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారికి అభిషేక సేవలు గావించారు. ఉదయం నుండే స్వామి వారికి నిత్యోపాసన, షోడశోపచార పూజలు, బలిహరణం వంటి నిత్య పూజలను అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.