ఆదోనిలో కాలుష్య కోరల్లో అమరావతి నగర్

★ బూడిద వర్షంతో కుటుంబాలు విలవిల

పయనించే సూర్యుడు జనవరి 13 ఆదోని నియోజకవర్గంలో క్రైమ్ రిపోర్టర్ కృష్ణ ఆదోని పట్టణ శివారులోని అమరావతి నగర్ కాలనీ నివాసితులు ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న దట్టమైన నల్లటి పొగ, బూడిద కాలనీని పూర్తిగా కమ్మేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 680 కుటుంబాలు నివసిస్తున్న ఈ కాలనీలో గాలి పీల్చుకోవడం కూడా కష్టంగా మారిందని, ఇళ్లపై నిరంతరం బూడిద వర్షంలా కురుస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలుష్యం కారణంగా పసిపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులతో పాటు కంటి అలర్జీల బారిన పడుతున్నారు. ఆహార పదార్థాలు, తాగునీరు కూడా కలుషితం అవుతుండటంతో ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు తమ ప్రాణాలకు ముప్పుగా మారాయని, ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఈ కాలుష్య కోరల నుండి కాపాడాలని వారు వేడుకుంటున్నారు.