పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 13 మామిడిపెల్లి లక్ష్మణ్ ఇటిక్యాల గ్రామంలో నిషేధిత చైనా మంజా విక్రయాలను అరికట్టేందుకు పంచాయతీ కార్యదర్శి రాజేష్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని పలు కిరాణా దుకాణాలను పరిశీలించి, గాలిపటాల కోసం ఉపయోగించే చైనా మంజా దారాన్ని విక్రయించరాదని దుకాణదారులకు కఠినంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ, చైనా మంజా అత్యంత ప్రాణాంతకమైనదిగా గుర్తించబడిందని, దీని వినియోగంతో ప్రజలు, పక్షులు, జంతువులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. నిషేధిత చైనా మంజాను విక్రయించినట్లు గుర్తిస్తే సంబంధిత దుకాణాల షాప్ లైసెన్సులు రద్దు చేయడంతో పాటు చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అలాగే, గ్రామంలో ఎవరైనా చైనా మంజాను విక్రయిస్తున్నా లేదా వినియోగిస్తున్నట్టు గుర్తించినట్లయితే వెంటనే పంచాయతీ కార్యాలయానికి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. చైనా మంజా రహిత గ్రామంగా ఇటిక్యాలను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.