పయనించే సూర్యుడు జనవరి 13 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన పిట్టల అశోక్ (19) అనే యువకుడు మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. ముల్కనూర్ ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం ధర్మారం గ్రామానికి చెందిన పిట్టల సురేందర్ కుమారుడైన పిట్టల అశోక్ ఈ నెల 6వ తన తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు కూలి పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కొడుకు కనిపించకపోవడంతో, వారు ఈ నెల 7వ తేదీన ముల్కనూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం సుమారు 3:00 గంటల సమయంలో, ధర్మారం నుండి మంచినీళ్ల బండకు వెళ్లే దారిలో ఉన్న గుట్టల ప్రాంతంలో ఒక మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అది కనిపించకుండా పోయిన పిట్టల అశోక్ మృతదేహంగా గుర్తించారు.. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి దుర్వాసన వస్తుండటంతో దానిని పోస్టుమార్టం గురించి ఆసుపత్రికి తరలించడం సాధ్యపడలేదు. దీంతో పోలీసు అధికారులు హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు సమాచారం ఇచ్చారు.. నిబంధనల ప్రకారం వైద్యులు అక్కడే పోస్ట్ మార్టన్ నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని అశోక్ తల్లిదండ్రులైన సురేందర్ కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు..
