కొత్తకొండలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు

★ మూడవ రోజు విశేష పూజలు.

పయనించే సూర్యుడు జనవరి 13 ఎన్ రజినీకాంత్:- హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు సోమవారం ప్రాతఃకాలమున ఆలయంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. సోమవారం వీరభద్ర స్వామికి వేద మంత్రోచ్ఛారణల మధ్య మహన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం యాగశాలలోని నైరుతి వేదికలో వాస్తు పూజ, వాస్తు హోమము, వాస్తుబలి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు. లోక కళ్యాణం కోసం ఈ వాస్తు ప్రక్రియలను నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. అనంతరం స్వామివారికి నిత్య బలిహరణ నైవేద్యమును సమర్పించి, ప్రత్యేక అర్చనలతో పూజలను ముగించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషన్ రావు, ఆలయ అర్చకులు,భక్తులు పాల్గొన్నారు.