రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారం అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరి

* 30 ఏళ్ల నిస్వార్థ పత్రికా సేవలకు అరుదైన గుర్తింపు

పయనించే సూర్యుడు / జనవరి 13 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్; కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరి పత్రికా రంగంలో గత మూడు దశాబ్దాలుగా అందిస్తున్న విశిష్టమైన, నిస్వార్థ సేవలకు గాను ‘రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారం’ వరించింది. సమాజంలో మానవ విలువల పరిరక్షణ, ప్రజా సమస్యల వెలుగులోకి తేవడంలో ఆయన చేసిన కృషికి ఈ గౌరవం దక్కడం జర్నలిజం రంగానికే గర్వకారణంగా నిలిచింది. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి మెయిన్ హాల్‌లో ఘనంగా నిర్వహించిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని మండల యాదగిరిని శాలువాతో సత్కరించి, స్మారక అవార్డును అందజేశారు. ఈ అవార్డుకు మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ యాదగిరిని ఎంపిక చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో పలు సంస్థల వ్యవస్థాపకులు ఇంటర్నేషనల్ గ్లోబల్ ఈవెంట్ అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డ్ గ్రహీత కదరి వెంకటరమణరావు ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, డాక్టర్ శివ నాగార్జున రెడ్డి, సినీ కళాకారిణి ఐశ్వర్య, డాక్టర్ పి. ఝాన్సీరామ్, మండల యాదగిరిని శాలువా కప్పి సర్వోత్తమ సేవ పురస్కారం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు, ముఖ్య అతిథులు కోలేటి దామోదర్ గుప్తా, దైవజ్ఞ శర్మ, డాక్టర్ శివ నాగార్జున రెడ్డిలు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మండల యాదగిరి పత్రికా రంగంలో అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. వృత్తి పరంగా ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని, ఎలాంటి స్వార్థం ఆశించకుండా సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఆయన పనిచేశారు అని ప్రశంసించారు. ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తెస్తూ, మానవతా విలువలను కాపాడే దిశగా ఆయన చేసిన కృషి యువ జర్నలిస్టులకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మానవ విలువలను పెంపొందించే దిశగా జర్నలిస్టులు అహర్నిశలు కృషి చేయాలని, నిరంతర సేవా తత్పరులుగా మారాలని వక్తలు ఆకాంక్షించారు. యాదగిరి ఇలాగే మరిన్ని సంవత్సరాలు జర్నలిస్టుగా సేవలందించి ప్రజల చేత, ప్రభుత్వ చేత గుర్తింపు పొంది ఇంకా ఎన్నో అవార్డులు, రివార్డులు, సత్కారాలు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మరో ముఖ్య అంశాన్ని ప్రస్తావిస్తూ పత్రికా రంగంలో 25 ఏళ్లు పైగా సేవ చేసిన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వం జీవనోపాధి భద్రత, ఆర్థిక సహాయం కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమమే ప్రజాస్వామ్య బలోపేతానికి పునాదిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవ పురస్కారం అందుకున్న మండల యాదగిరి హుజురాబాద్ పట్టణానికే కాకుండా, కరీంనగర్ జిల్లాకు గర్వకారణంగా నిలిచారని పలువురు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *