పయనించే సూర్యుడు జనవరి 14 ఎన్ రజినీకాంత్:- ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఏర్పాట్లను దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ రామకృష్ణారావు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనాలు అందించి శాలువాతో సన్మానం చేసి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. జాతర నిర్వహణపై మాట్లాడుతూ జాతరకు వచ్చే వేలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, క్యూ లైన్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. జాతర ప్రాంగణంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహిస్తూ జాతరను విజయవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కిషన్ రావు, అర్చకులు ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు
