పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 14 బోధన్ : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటించి ప్రమాద రహిత తెలంగాణను సాధించుకుందామని బోధన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం బోధన్ బస్టాండ్ ప్రాంగణంలో బోధన్ పట్టణ పోలీస్ వారి ఆధ్వర్యంలో డీజీ మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు అలైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమాలపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ఏసీబీ మాట్లాడుతూ బాధ్యతగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడం వలన రోడ్డు ప్రమాదాలను నివారించడానికి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.మానవ తప్పిదాల వలనే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలు అనేకము ఉన్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం వలన అనేక కుటుంబాలు దీన పరిస్థితులను ఎదుర్కొంటున్న సందర్భాలు అందరికీ తెలిసిందేనన్నారు. రోడ్డు నియామ నిబంధనలు ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ పాటించకుండా నిర్లక్ష్యపు రోడ్డు ప్రయాణాలు చేస్తూ ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించుటకై పలు ప్రభుత్వ శాఖల వారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రయాణికులు పెడచెవిన పెడుతూ రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నారని గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో ఎవరైనా రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని కాపాడి ఆసుపత్రికి తరలించినట్లయితే వారికి ప్రోత్సాహకంగా రూ 25 వేలు ఇవ్వడంతో పాటు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో 5 సార్లు సహాయం అందించినట్లయితే అదనంగా లక్ష రూపాయల ప్రోత్సాహక నగదును ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం 10 రోజులపాటు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. రోడ్డు నియమ నిబంధనలను పాటించవలసిందిగా వాహనదారులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ ఠాణా సిఐ వెంకటనారాయణ, ఏఎంవిఐ శ్రీనివాస్, బోధన్ బస్ డిపో మేనేజర్, విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్, ఎస్సై, పోలీస్ శాఖ సిబ్బంది, ట్రాఫిక్ ఎస్ఐ, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది,ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.