
పయనించే సూర్యుడు న్యూస్ .జనవరి15, ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి) ఆదోని పట్టణంలో చోటుచేసుకున్న ఒక సంఘటన రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. బీజేపీకి చెందిన కొందరు నాయకులు ఒక స్థలంలో పార్టీ జెండాలు పాతి, రాళ్లు వేసి హల్‌చల్ చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకుడు వై.పి. కృష్ణమోహన్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ స్థలం ఎస్సీ సామాజిక వర్గానికి చెందినదని తెలుసుకున్న ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజలకు మంచి చేస్తుందన్న నమ్మకంతో పార్టీలోకి వస్తే, ఇలా భూ కబ్జాలకు పాల్పడటం అత్యంత బాధాకరమని కృష్ణమోహన్ మండిపడ్డారు. పేద ప్రజల స్థలాలను ఆక్రమించే సంస్కృతిని తాను సహించలేనని చెబుతూ, సంఘటనా స్థలంలోనే తన మెడలోని పార్టీ కండువాను తీసివేసి బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే పార్థసారథి ఆదోనిలో భూ కబ్జాలను సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని.. మరి ఈరోజు పట్టపగలే బీజేపీ నాయకులు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతుంటే బాధ్యత ఎవరు వహిస్తారని ఆయన ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల ఆస్తులపై కన్నేసి ఇలాంటి పనులకు ఒడిగట్టడం దారుణమని, ఆదోని పట్టణ ప్రజలు రాబోయే రోజుల్లో వీటన్నింటినీ గమనించాలని కోరారు. ఈ ఘటన వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే దానిపై అధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వై.పి. కృష్ణమోహన్ డిమాండ్ చేశారు.