
పయనించే సూర్యుడు,15 జనవరి 2026 భీంగల్ మండల ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి ,నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ పట్టణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాన్ని శ్రీ సరస్వతి శిశు మందిరం విద్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బసంత్ రెడ్డి, వారే దస్తగిరి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో సమాజ హితానికి ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని ప్రశంసించారు. సమాజంలో సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను కాపాడడంలో స్వయం సేవకుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. సంక్రాంతి పండుగ భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి ఉత్సవాల ద్వారా యువతలో జాతీయ భావన పెంపొందుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయం సేవకులు, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు.