పయనించే సూర్యుడు జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 17 జగ్గయ్యపేట పట్టణంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ నియమాలను ఉల్లంఘించడం అత్యంత దురదృష్టకరమని ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘ చీఫ్ ఆర్గనైజర్ కర్లపాటి వెంకట శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ పరిధిలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఆర్యవైశ్య సంఘ బాధ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించడం సంఘ పరంపరలకు, నియమావళికి విరుద్ధమని ఆయన అన్నారు. ఇలాంటి వ్యవహారాలు సంఘ ఐక్యతకు భంగం కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సంక్రాంతి సంబరాలు కేవలం వేడుకలకే పరిమితమై, నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక సహకారం అందించకపోవడం బాధాకరమని ఆయన విమర్శించారు. ముఖ్యంగా విద్యాభ్యాసంలో ఉన్న పేద ఆర్యవైశ్య విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యా సహాయం వంటి అంశాలను పూర్తిగా విస్మరించారని ఆక్షేపించారు. ఆర్యవైశ్య సంఘాలు కేవలం వేడుకలు, ఫోటోలు, ప్రచార కార్యక్రమాలకే పరిమితం కాకుండా, సమాజంలో వెనుకబడిన, ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలను ఆదుకునే దిశగా పనిచేయాల్సిన బాధ్యత ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ బాధ్యతను విస్మరించడం వల్ల సంఘ ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉందన్నారు. పేట ఆర్యవైశ్య సంఘాల ప్రస్తుత తీరుతో సంఘ ఐక్యతకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉందని, ఇది భవిష్యత్తులో మరిన్ని అపార్థాలకు దారితీయవచ్చని పేర్కొన్నారు . ఇప్పటికైనా సంబంధిత సంఘాలు నిరుపేద ఆర్యవైశ్యులను గుర్తించి, వారికి విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి రంగాల్లో ఇతోదికంగా సహాయ సహకారాలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు చేపట్టినా మహాసభ నియమాలు, సంఘ పరంపరలు, జిల్లా స్థాయి సమన్వయాన్ని తప్పనిసరిగా పాటించాలని కోరారు. సమాజ అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ఆర్యవైశ్య సంఘాలు ఐక్యంగా, బాధ్యతాయుతంగా ముందుకు సాగినప్పుడే నిజమైన సేవ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. కర్లపాటి వెంకట శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘ చీఫ్ ఆర్గనైజర్