పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 17 బోధన్: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మంజీరా పరివాహక ప్రాంతమైనటువంటి సాలూరలోని పంట చేనులలో ఆనవాయితీగా పూజలు నిర్వహిస్తుంటారు. గురువారం మకర సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామస్తులు వారి వారి పంట చేనులోకి వెళ్లి ప్రకృతి, సూర్య భగవానుడు, పశువులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేక పూజలు చేశారు. కొత్త పంట ధాన్యం, చెరుక, నువ్వులు, బెల్లంతో చేసిన పిండివంటలతో భగవంతుడు, ప్రకృతికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సంపద, సంక్షేమాన్ని కోరుకున్నారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున పంట చేనులలో ఈ విధంగా పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని గ్రామ పెద్దలు, రైతులు స్పష్టం చేశారు. ఈ పూజా కార్యక్రమాలలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, రైతులు, మహిళలు, చిన్నారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.