పయనించే సూర్యుడు జనవరి 18 పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ పాపన్నపేట మండల పరిధిలోని అన్నారం గ్రామంలో శనివారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం గ్రామ ప్రజల్లో విశేష స్పందన పొందింది. సామాన్యుడి పొదుపుకు భద్రత కల్పించడం, బ్యాంకు డిపాజిట్ల రక్షణపై అవగాహన పెంచడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ డిఈ ఏ ఫ్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ అవగాహన ప్రచారం కొనసాగుతోందని, అందులో భాగంగానే అన్నారం గ్రామంలో ఈ సమావేశం నిర్వహించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర ప్రభుత్వ రంగ బ్యాంకులు భాగస్వాములుగా పాల్గొన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ వాటి ద్వారా లభించే బీమా, పెన్షన్, డిపాజిట్ భద్రత వంటి ప్రయోజనాలపై పూర్తి అవగాహన లేకపోవడం కనిపిస్తోందని అధికారులు పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా అనేది కేవలం డబ్బు దాచుకునే సాధనం మాత్రమే కాకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా పొందేందుకు, బీమా రక్షణ కల్పించేందుకు, వృద్ధాప్యంలో పెన్షన్ భరోసా పొందేందుకు, డిజిటల్ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించేందుకు ప్రధాన ఆధారమని గ్రామ ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి జనధన్ యోజన ద్వారా సున్నా బ్యాలెన్స్‌తో బ్యాంకు ఖాతా తెరిచే అవకాశం, రూపే డెబిట్ కార్డు, ప్రమాద బీమా వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులని, ప్రభుత్వ సంక్షేమ పథకాల నిధులు నేరుగా ఖాతాల్లో జమ అవుతున్నందున పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారిందని పేర్కొన్నారు. తక్కువ ప్రీమియంతో జీవిత బీమా రక్షణ కల్పించే ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వారు ఈ పథకంలో చేరవచ్చని, ఖాతాదారుడి అకాల మరణం సంభవించినపుడు కుటుంబానికి రూ.2 లక్షల బీమా రక్షణ లభిస్తుందని తెలిపారు. అనుకోని ప్రమాదాలు, అనివార్య పరిస్థితుల్లో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా కాపాడే ప్రధాన సాధనంగా ఈ బీమా ఉపయోగపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీమా పథకాల ప్రయోజనాలు మాటల్లోనే కాకుండా ప్రత్యక్షంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయని చాటుతూ, అన్నారం గ్రామానికి చెందిన ఒక లబ్ధిదారుడి కుటుంబానికి రూ.2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును గ్రామ సర్పంచ్ గంటరాణి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేయగా, బీమా పథకాలపై మరింత నమ్మకం పెరిగిందని పలువురు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ గంటరాణి మాట్లాడుతూ, ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని గ్రామ ప్రజలను కోరారు. కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే బీమానే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలుస్తుందని పేర్కొన్నారు. పొదుపు అలవాటు పెంపొందించుకోవాలని, బ్యాంకు ఖాతాలు, బీమా, పెన్షన్ పథకాలపై పూర్తి అవగాహనతో ముందుకు సాగాలని సూచించారు. గ్రామ ప్రజల భవిష్యత్తు భద్రంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని ఆమె తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులు, కూలీలు, చిరుద్యోగులకు వృద్ధాప్యంలో భరోసా కల్పించే అటల్ పెన్షన్ యోజనపై కూడా అధికారులు వివరించారు. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారు ఈ పథకంలో చేరవచ్చని, 60 ఏళ్లు పూర్తయ్యాక నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు జీవితాంతం పెన్షన్ లభిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థిర ఆదాయం లేని వర్గాలకు ఈ పథకం పెద్ద దిక్సూచి అని పేర్కొన్నారు. బ్యాంకుల్లో ప్రజలు జమ చేసే డిపాజిట్ల భద్రతపై ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డి ఐ సి జీ సి ద్వారా ప్రతి డిపాజిటర్‌కు రూ.5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. సేవింగ్స్ ఖాతాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు అన్నింటికీ కలిపి ఈ రక్షణ వర్తిస్తుందని వివరించారు. పెరుగుతున్న ఆన్‌లైన్, డిజిటల్ మోసాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, పిన్ నంబర్లు ఎవరితోనూ పంచుకోకూడదని, అనుమానాస్పద కాల్స్‌కు స్పందించరాదని, తెలియని లింక్‌లపై క్లిక్ చేయకూడదని, ఏటీఎంల వద్ద అపరిచితుల సహాయం తీసుకోరాదనిఆ హెచ్చరించారు. మోసానికి గురైన వెంటనే సంబంధిత బ్యాంకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచి జంగటి లింగం సీనియర్ నాయకులు బత్తుల కుమార్, జముల రవి, బేగర్ కుమార్, కోలల లక్ష్మీనారాయణ, ఎండి ఏజాజ్, బండారి బాలకృష్ణ, సర్వర్ పటేల్, రాజా గౌడ్. యువసేన యూత్ సభ్యులు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.