కమ్యూనిజానికి మరణం లేదు –సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య

పయనించే సూర్యుడు జనవరి 18 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ భారత కమ్యూనిస్టు పార్టీకి వందేళ్ల చరిత్ర ఉందని, కమ్యూనిజానికి ఎప్పటికీ మరణం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య స్పష్టం చేశారు. సిపిఐ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో జరగనున్న గొప్ప బహిరంగ సభకు సన్నాహకంగా ఆదోనిలో నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదోని పట్టణంలోని స్థానిక అనంత మంగళ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి వందలాది మంది సిపిఐ కార్యకర్తలు, నాయకులు ఎర్రజెండాలతో పురవీధుల గుండా ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ మైదానాన్ని చేరుకున్నారు. అనంతరం అక్కడ సిపిఐ పట్టణ కార్యదర్శి టి.వీరేష్ అధ్యక్షతనజరిగిన బహిరంగ సభలో బి. గిడ్డయ్య ప్రసంగించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ విధానాలు ప్రజావ్యతిరేకంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. దేశంలోని పేదలు, కూలీలకు జీవనాధారంగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చాలనే ప్రయత్నాలను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఈ పథకాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, కానీ పేర్లు మార్చడం ద్వారా ప్రజలను మోసం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. కార్మికులు, రైతులు, కూలీల హక్కుల కోసం కమ్యూనిస్టు పార్టీ వందేళ్లుగా పోరాటం చేస్తోందని, భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో ప్రజల పక్షాన నిలబడుతుందని బి. గిడ్డయ్య తెలిపారు. ఖమ్మంలో జరగనున్న సిపిఐ వందేళ్ల గొప్ప బహిరంగ సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ సుదర్శన్ సిపిఐ సీనియర్ నాయకులు కే అజయ్ బాబు ఆలూరు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి భూపేష్, ఆలూరు రైతుకూలీ సంఘం కార్యదర్శి రామచంద్ర, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి బి వెంకన్న, ఏపీ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి బసాపురం గోపాల్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి యు లక్ష్మీనారాయణ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సాబీర్ బాషా పట్టణ కార్యదర్శి దస్తగిరి డిహెచ్పిఎస్ జిల్లా సంస్థలు విజయ్ సిపిఐ నాయకులు కుమార్ స్వామి, కార్యకర్తలు ,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ నినాదాలతో సభా ప్రాంగణాన్ని మారుమోగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *