కళతో పోలీస్ శాఖకు గుర్తింపు తీసుకొస్తున్న కానిస్టేబుల్ విక్రమ్

★ సిపి సునీల్ దత్ కు పెన్సిల్ స్కెచ్ బహుకరించి ప్రశంసలు అందుకున్న దాసరి విక్రమ్..

పయనించే సూర్యుడు జనవరి 18, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). పోలీస్ విధి నిర్వహణలో కఠినంగా ఉంటూనే కుంచె చేతబట్టి కళా సౌందర్యాన్ని ఆవిష్కరిస్తున్న ప్రతిభావంతుడు చింతకాని మండలం గాంధీనగర్ కాలనీకి చెందిన దాసరి విక్రమ్. ప్రస్తుతం పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఐపీఎస్ పట్ల ఉన్న గౌరవంతో ఆయన చిత్రాన్ని పెన్సిల్ స్కెచ్ గా మలిచారు. శుక్రవారం కమిషనరేట్లో సిపిని మర్యాదపూర్వకంగా కలిసి ఆ చిత్రపటాన్ని వారికి బహుకరించారు. కేవలం ఒక చిత్రపటానికి పరిమితం కాకుండా విక్రమ్ తన కళా ప్రతిభను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక పోలీస్ బెటాలియన్ లో చాటుకున్నారు. వివిధ బెటాలియన్ల గోడలు, కార్యాలయాల్లో, పోలీసుల త్యాగాలు, సాహసాలు, సామాజిక అంశాలను ప్రతిబింబించేలా ఆయన వేసిన పెయింటింగ్స్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వృత్తి పట్ల నిబద్ధతతో పాటు కళా రంగంలో ఆయన చూపిస్తున్న చొరవను పలువురు కమాండెంట్లు ఇప్పటికే ప్రశంసించారు. తన శాఖలో ఇంతటి గొప్ప కళాకారులు ఉండటంపై సిపి సునీల్ దత్ హర్షం వ్యక్తం చేశారు. విక్రమ్ గీసిన పెన్సిల్స్ స్కెచ్ను చూసి అభినందించడమే కాకుండా భవిష్యత్తులో కూడా తన కళ ద్వారా పోలీస్ శాఖకు మరింత గుర్తింపు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.