
పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 18, తల్లాడ రిపోర్టర్ చలిని తరిమికొట్టే బోగి మంటలు, ఆ మంటల్లో చిన్నారులు ఆవు పేడతో చేసిన బోగి పిడతలను వేయడం, హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు! ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు! వేకువజామునే జంగమదేవరల జేగంటలు, ఢమరుక నాదాలు..! అక్కడక్కడా పిట్టలదొరల బడాయి మాటలతో కుర్నవల్లి గ్రామం సంక్రాంతి పండుగకు సరికొత్త శోభతో విరాజిల్లింది. ముఖ్యంగా ప్రవాస భారతీయుడు సహకారంతో గ్రామంలోని యువత ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిర్వహించిన రంగుల హరివిల్లు కుర్నవల్లి వాకిళ్లను ఆవహించినట్టు ఆ ఇంద్రధనస్సు నింగి నుంచి నేలకు దిగి ముంగిలి లో ముగ్గైనట్టు.. కుర్నవల్లి సంక్రాంతి వేడుకలతో సంబరం చేసుకుంది.ప్రవాస భారతీయుడు శీలం నరేందర్ రెడ్డి, స్వప్న దంపతుల సహకారంతో గ్రామంలోని బొడ్రాయి సెంటర్,వేంకటా చలపతి దేవస్థాన యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీకి విశేష స్పందన లభించింది. చిన్న పెద్ద, ఆడబిడ్డలు, కొత్త కోడళ్ళు అనే తేడా లేకుండా ఊరుమ్మడి ఆడపడుచులు తమ సృజనాత్మకతకు పదును పెట్టి నింగిలో చుక్కలు నేలను తాకి, మెరుపు తీగలను మలుచుకొని ముగ్గైనట్టు, ఆడపడుచుల చేతులలో ముగ్గులు ముద్దబంతి పువ్వులా మెరిసినాయి. సుమారు 120 పైగా అద్దుకున్న అందాలు సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచి, సమైక్యతా రాగాన్ని వినిపించాయి. నిస్వార్థ భావాన్ని తడిమి లేపాయి. గ్రామీణ వాతావరణాన్ని, శ్రామిక సౌందర్య వాతావరణాన్ని పులుముకొని, పులకరించాయి నింగిన తారజువ్వలై, నేలన తారలై అందాల హరివిల్లులై ముంగిలి ముద్దాడినవి. సంధ్య వేళలో జరిగిన ఈ వర్ణ వాదనలకు సరిజోడు తేల్చడానికి సాధ్యం కాని పోటీ పడింది. ఈ ముగ్గులపోటీని యావన్మంది తిలకించి ముగ్ధులయ్యారు. కాగా ఈ పోటీలో విజేతలను ఎంపిక చేసేందుకు ముగ్గురు న్యాయవాదులు ఇద్దరు ఉపాధ్యాయులు తన కౌశలాన్ని ప్రదర్శించాల్సి వచ్చింది. ప్రతి ముగ్గుని విశ్లేషించి, ఆఖరుకు పది ముగ్గులను ఎంపిక చేసి, వాటిలో ప్రథమ స్థానంలో ఉన్న ఐదు ముగ్గులను ప్రకటించారు. విజేతలకు న్యాయనిర్ణేతల చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేశారు. న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన వాటిలో హై కోర్టు న్యాయవాది అయితగాని జనార్దన్, జిల్లా కోర్టు న్యాయవాదులు కోటేరు స్పందన రెడ్డి, మౌనిక ప్రభుత్వ కళాశాల ఉపన్యాసకురాళ్ళు కాటినేని దుర్గ, ధారా ప్రమీల ఉన్నారు. అనంతరం విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

