పయనించే సూర్యుడు జనవరి 18 నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ కావడంతో ప్రజలకు మెరుగైన వైద్య పరీక్షలు అందుబాటులోకి రానున్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే. రవికుమార్ తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నియామక పరీక్షల ద్వారా ఎంపికైన 15 మంది ల్యాబ్ టెక్నీషియన్లు నాగర్‌కర్నూల్ జిల్లాలో పనిచేయుటకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రిపోర్టు చేశారు. సోమవారం నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే. రవికుమార్ నూతనంగా నియమితులైన ల్యాబ్ టెక్నీషియన్లకు వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులలో చేరుటకు నియామక ఉత్తర్వులు అందజేశారు.గ్రామీణ మరియు గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్ల కొరత కారణంగా రక్తం, మూత్ర పరీక్షలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తాజా నియామకాలతో ఆ సమస్య పూర్తిగా పరిష్కారమైందని ఆయన పేర్కొన్నారు. నూతనంగా నియమితులైన ల్యాబ్ టెక్నీషియన్లు ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన ఆరోగ్య సేవలు అందించడంలో చురుకుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది భరత్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ సంఘ జిల్లా అధ్యక్షులు పి. కళ్యాణ్, రేనయ్యా, నూతన ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.