పయనించే సూర్యుడు-రాజంపేట న్యూస్ జనవరి 18: రాజంపేట పట్టణ వ్యాప్తంగా మూడు రోజులు సంక్రాంతి సంబరాలు వైభవంగా ముగిశాయి. పట్టణంలోని బోయపాలెం వీధిలోని మహిళలు శనివారం గొబ్బెమ్మ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా బోయపాలెం వీధిలో మహిళలందరూ వీధిలోని రామాలయం వద్దకు చేరి, గొబ్బెమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. గొబ్బెమ్మను భక్తిశ్రద్ధలతో, ఆటపాటలతో అలరించి, అనంతరం ఊరేగింపు నిర్వహించి పోలి చెరువు కట్ట వద్ద నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఆచారంగా వస్తున్న గొబ్బెమ్మ పండుగతో పాడిపంటలు అభివృద్ధి చెంది, ప్రజలంతా సుఖసంతోషాలతో మెలుగుతారన్న ఆకాంక్షతో ప్రతి ఏటా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కోలాటం, చిన్నారుల ఆట పాటలు అందరినీ అలరించాయి.