పయనించే సూర్యుడు జనవరి 18 మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల్ మండల్ రిపోర్టర్ (గొడుగు ఆశీర్ విల్సన్) విద్యాసంస్థల్లో కుల వివక్షను నిర్మూలించడానికి వేముల రోహిత్ చట్టాన్ని తీసుకురావాలని వివిధ సామాజిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. శనివారం రోజున మంచిర్యాల ఫూలే భవన్లో జరిగిన వేముల రోహిత్ 10వ వర్ధంతి సభలో వారు పాల్గొని ప్రసంగించారు. ఉన్నత విద్యాలయాల్లో తిష్టవేసిన అమానుష కులవివక్ష కారణంగానే.. పదేళ్ల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు ఒడిగట్టాడని వారు ఆరోపించారు. రోహిత్ చావుకు కారకులయిన మనువాదులను శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చెలరేగినా.. నేటికీ న్యాయం దక్కలేదని తెలిపారు. దేశంలో రాజ్యమేలుతున్న మనువాద వ్యవస్థ కారణంగానే మెజార్టీ వర్గాలకు చెందిన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు అనేక వివక్షలను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. బ్రిటిష్ వాళ్లు మన దేశంపై రుద్దిన వలసవాద బానిసత్వం కంటే.. స్వార్ధపరశక్తులు సృష్టించిన మనువాద బానిసత్వమే హేయమైనదని మహాత్మ ఫూలే తెలిపాడని వారు పేర్కొన్నారు. దళిత బిడ్డల మానవ హక్కులను హరించిన మనువాద భావాజాలమే, నేడు బీసీ వర్గాల రిజర్వేషన్లను సైతం అడ్డుకుంటున్నదని వారు పేర్కొన్నారు. మెజార్టీ వర్గాల ప్రజలు కులభేదాలను పక్కనపెట్టి, బహుజన ఐక్యతతో ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ మేధావుల ఫోరం జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ శ్రీరామోజు కొండయ్య, బహుజన ఐక్యవేదిక నాయకులు కామిల్ల జయరావు, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు సంకె రవి, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు దేవి పోచయ్య, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి డూర్కె మోహన్, దళిత ఐక్యవేదిక నాయకులు పలిగిరి కనకరాజు, సీనియర్ అడ్వకేట్ రెడ్డిమల్ల ప్రకాశం, సామాజిక ఉద్యమ కారులు మోతె రామదాసు, పురంశెట్టి శ్రీధర్, గౌరయ్య, తాడూరి పోచన్న, కైలాసం, వేముల వీరస్వామి, రవూఫ్ వివిధ దళిత బహుజన ప్రజాస్వామిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.