లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్ వార్డులు ఖరారు

* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పయనించే సూర్యుడు న్యూస్ :పెద్దపల్లి , జనవరి 18:- లాటరీ పద్దతి ద్వారా జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహిళా రిజర్వేషన్ వార్డులు ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మున్సిపల్ వార్డు / డివిజన్ రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, మున్సిపల్ వార్డు, డివిజన్ లను రిజర్వేషన్ వారీగా కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 124 వార్డులలో 50 శాతం మహిళలకు కేటాయిస్తున్నట్లు, వీటిని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా పద్ధతిలో ఖరారు చేశామని అన్నారు.పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల వార్డు సంఖ్య లో మార్పులు లేకపోవడంతో గత ఎన్నికల మాదిరిగానే ఎస్సి, ఎస్టీ, బీసీ లకు సీట్లను రిజర్వు చేశామని , రామగుండం పరిధిలో వార్డుల సంఖ్య 50 నుంచి 60 కు పెరగడంతో ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సి, ఎస్టీ సీట్లు, బీసి సీట్లను బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా కేటాయింపులు చేపట్టామని అన్నారు.పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల పరిధిలో రోటేషన్ పద్దతిలో రిజర్వేషన్ వార్డుల కేటాయింపు ఉంటుందని, రామగుండం పరిధిలో వార్డుల సంఖ్య పెరిగినందున రిజర్వేషన్ సీట్లు పునరావృతం అయ్యే అవకాశం ఉండవచ్చని అన్నారు. ఎస్సీలకు రామగుండం లో 13, పెద్దపల్లిలో 4, మంథని లో 2, సుల్తానాబాద్ లో 2 , ఎస్టీ లకు రామగుండం లో 1, పెద్దపల్లిలో 1, మంథని లో 1, సుల్తానాబాద్ లో 1, బీసీలకు రామగుండం లో 16, పెద్దపల్లిలో 13, మంథని లో 3, సుల్తానాబాద్ లో 4 స్థానాలు రిజర్వ్ అయ్యాయని అన్నారు.అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మున్సిపాలిటీలలో వార్డుల వారిగా కేటాయించిన రిజర్వేషన్ వివరాలను తెలుపుతూ లక్కీ డ్రా ద్వారా మహిళలకు వార్డుల కేటాయింపు చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ , మున్సిపల్ కమిషనర్లు,వెంకటేష్, రమేష్, మనోహర్ సంబంధిత అధికారులు,తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *