
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 18 రాజన్న సిరిసిల్ల జిల్లా (స్టాఫ్ రిపోర్టర్ ఎమ్.ఎ. షకీల్ ) విద్యార్థి దశ నుంచే క్రీడలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సీఎం కప్ పోటీల ప్రారంభం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో శనివారం సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి ప్రారంభించారు. అంబేద్కర్ చౌక్ నుంచి నేతన్న విగ్రహం వరకు విప్, ఇంచార్జి కలెక్టర్, ఎస్పీ, అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒలింపిక్స్ లో దేశం నుంచి ఎక్కువ సంఖ్యలో పతకాలు సాధించాలనే ఉద్దేశ్యంతో ప్రజా ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని తెలిపారు. సీఎం కప్ పేరిట రాష్ట్రంలోని గ్రామ స్థాయి నుంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికి తీసి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. వివిధ క్రీడ విభాగాల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి షెడ్యూల్ ప్రకారం పోటీలు నిర్వహిస్తుందని వివరించారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు, శిక్షణ అందిస్తుందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తుందని, యువత, విద్యార్థులకు ఉత్తమ శిక్షణ, ఉపాధి కల్పించే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రస్థాయిలో ఎక్కువ పతకాలు సాధించాలి జిల్లాలోని విద్యార్థులు, యువత సీఎం కప్ పోటీల్లో పాల్గొని ఎక్కువ సంఖ్యలో పతకాలు సాధించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. సీఎం కప్ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు, యువత మొబైల్ ఫోన్లు తక్కువ ఉపయోగించాలని, క్రీడలు, మైదానాల్లో ఎక్కువ సమయం గడపాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడంతో శారీరక దారుఢ్యం, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని తెలిపారు. సీఎం కప్ టార్చ్ ర్యాలీ సిరిసిల్లలో మొదలై జిల్లాలోని అన్ని మండలాల్లో సాయంత్రం వరకు పూర్తి అవుతుందని తెలిపారు. జిల్లా నుంచి విద్యార్థులు, యువత క్రీడల్లో రాణించేలా జిల్లా క్రీడల, విద్యా శాఖ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం జిల్లాలో మొత్తం 34 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి.. రాష్ట్రస్థాయికి పంపిస్తామని పేర్కొన్నారు. అన్ని క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించి జిల్లా నుంచి టీమ్ లను వచ్చే నెలలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇదీ షెడ్యూల్.. గ్రామపంచాయతీ లెవల్లో ఈ నెల 17 నుంచి 22 వ తేదీ వరకు, మండల, మున్సిపాలిటీ జోనల్ లెవెల్ లో ఈ నెల 28 నుంచి 31 వరకు, జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు, జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 9 నుండి 12వ తేదీ వరకు, రాష్ట్రస్థాయిలో ఫిబ్రవరి 20 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
