
పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం, జనవరి 19 పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతాల గ్రామంలో జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నెలలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో భాగంగా కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లజోళ్లు అవసరమైన 167 మంది లబ్ధిదారులకు ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జయప్రద ఫౌండేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ తొండపు దశరథ జనార్ధన్ మాట్లాడుతూ తనకు రాజకీయంగా అవకాశం కల్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో జయప్రద ఫౌండేషన్ ను స్థాపించామని, ఫౌండేషన్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జనార్ధన్ కంటి ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ మనిషి జీవితంలో కళ్ళు అత్యంత విలువైన అవయవాలని, కంటి ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నేటి జీవనశైలిలో మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, కంప్యూటర్ల వినియోగం పెరగడం వల్ల చిన్న వయసులోనే కంటి సమస్యలు ఎదురవుతున్నాయని, కాబట్టి కాలానుగుణంగా కంటి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరమన్నారు. అవసరమైనప్పుడు కళ్లజోళ్లను ఉపయోగించడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుందని, కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కంటి చూపు మన జీవన నాణ్యతను నిర్ణయించే ప్రధాన అంశమని, అందుకే జయప్రద ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ జయప్రద ఫౌండేషన్ కోఆర్డినేటర్ కట్టా వెంకట నరసింహారావు , వేగినేటి గోపాలకృష్ణమూర్తి , నలజాల రాజు , జిల్లేపల్లి సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
