పయనించే సూర్యుడు జనవరి 20 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిగా అపారదర్శకంగా, చట్టవిరుద్ధంగా సాగుతోందని ఎస్ఎఫ్ఐ ఆదోని సన్ కలెక్టర్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ లో అడ్మిస్ట్రేషన్ అధికారి అనురాధ కి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం జిల్లా కార్యదర్శి రంగప్ప జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ జనవరి 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిరుద్యోగ మహిళల నుంచి అప్లికేషన్ ఫారాలు స్వీకరించిన అధికారులు, ముఖ్యంగా జనవరి 10వ మరియు 11వ తేదీలలో అప్లికేషన్‌లు తీసుకున్నప్పటికీ ఒక్క అభ్యర్థికీ రిసీట్లు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. అప్లికేషన్ స్వీకరణకు సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకుండా “ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి” అంటూ నిరుద్యోగులను పంపించివేయడం అనేది పూర్తిగా అనుమానాస్పద చర్యగా వారు అభిప్రాయపడ్డారు. అధికారులు సూచించిన వెబ్‌సైట్‌లో నేటి వరకు లాగిన్ అవుతున్నా అప్లికేషన్ నెంబర్లు గానీ, అభ్యర్థుల పేర్లు గానీ, రిసీట్లు గానీ కనిపించకపోవడం వల్ల నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపారు. ఇది ముమ్మాటికి నిరుద్యోగులను మోసం చేయాలనే దురుద్దేశంతో చేపట్టిన చర్యగా అని అన్నారు. ఈ భర్తీ ప్రక్రియకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, కన్వీనర్ గా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ఆఫీసర్, జిల్లా విద్యాశాఖ అధికారి, జిసిడిఓ కమిటీ సభ్యులుగా ఉన్నప్పటికీ, వారి నిర్లక్ష్యం వల్లే వేలాది మంది నిరుద్యోగులు నిలువునా మోసపోతున్నారని తీవ్రంగా విమర్శించారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తూ, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లే విధంగా కూటమి ప్రభుత్వంలోని నాయకులు, అధికారులు వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. రిసీట్లు ఇవ్వకుండా అప్లికేషన్‌లు స్వీకరించడం చట్టవిరుద్ధమని, ఇది ప్రభుత్వ నియామక నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే, న్యాయస్థానాలను, లోకాయుక్త, విజిలెన్స్ వంటి సంస్థలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. తక్షణమే కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏ విధంగా నియామకాలు జరుగుతున్నాయో నిరుద్యోగులకు స్పష్టంగా అర్థమయ్యేలా ఎస్పిడి కార్యాలయం లేదా జిల్లా పిఓ కార్యాలయం నుంచి వెంటనే అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అప్లై చేసిన నిరుద్యోగుల పేర్లు, వివరాలు తక్షణమే అధికారిక వెబ్‌సైట్‌లో చూపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో నిరుద్యోగులను ఏకం చేసి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, ముట్టడులు నిర్వహిస్తామని, దీనికి ప్రభుత్వం, అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్, జిల్లా సహాయ కార్యదర్శి రాము, జిల్లా కమిటి సభ్యులు విల్సన్ ఆదోని పట్టణ కమిటీ సభ్యులు జగన్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ తదితరులు పాల్గొన్నారు.