
పయనించే సూర్యుడు జనవరి 20, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : ఖమ్మం జిల్లాలో లక్షా 98 వేల ఎకరాల అదనపు ఆయకట్టు సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం చింతకాని మండలం వందనం గ్రామంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్ లతో కలిసి పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 2,500 ఎకరాలకు సాగునీరు అందించినందుకు 35 కోట్ల 75 లక్షలతో చేపట్టిన కోదుమూరు- వందనం ఎత్తిపోతల పథకం రెండో విడత పనులకు, వందనం ఎస్సీ కాలనీలో 1 కోటి 85 లక్షలతో చేపట్టిన అంతర్గత సిసి రోడ్లకు ఆర్ అండ్ బి రోడ్డు నుంచి వందనం -పుట్టకోట జడ్పీ రోడ్డు వరకు మూడు కోట్ల 50 లక్షలతో నిర్మించునున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రైతుల సాగునీటి సమస్యల పరిష్కారానికి ఈ లిఫ్ట్ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి గత రెండేళ్లలో 74 వేల 163 కోట్లు, పేదల సంక్షేమానికి 47 వేల 710 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతు సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లాస్థాయి, అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.