
పయనించే సూర్యుడు జనవరి 20, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: మహబూబ్ నగర్ రూరల్ గాజుల పేట గ్రామంలో శ్రీగాజేశ్వర నాట్య కళామండలి, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పౌరాణిక నాటక ప్రదర్శనలు కనువిందు చేశాయి. ఈ నెల 16, 17 తేదీలలో సంగీత దర్శకులు ఎం. అడవి రాముడు సారధ్యంలో ‘శ్రీకృష్ణ రాయబారం’లో వివిధ పౌరాణిక అంకాలను ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, మాట్లాడుతూ.. నాటక రంగం ప్రస్తుత సినీ రంగానికి మాతృమూర్తి వంటిదని కొనియాడారు. పౌరాణిక నాటకాలు సమాజాన్ని ఆలోచింపజేయడమే కాకుండా, మనిషి జీవిత గమ్యానికి దిశానిర్దేశం చేస్తాయని అన్నారు. ఎలాంటి అశ్లీలత లేకుండా సాగే ఈ కళా రంగాన్ని ప్రజలందరూ ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మిత్ర నాట్య కళామండలి అధ్యక్షులు వి. నారాయణ, డి. జనార్ధన్ నాటకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రముఖ రంగస్థల కళాకారులు తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారులు, ‘కళారత్న’ అవార్డు గ్రహీత కే.వి. చంద్రయ్య, ‘గాన గంధర్వ’ అవార్డు గ్రహీత బూదురు జంగయ్యలను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు, గాజేశ్వర నాట్య కళామండలి అధ్యక్షులు, నటకిరీటి బంగారు పెద్ద వెంకటయ్య , కార్యక్రమాన్ని తిలకించారు. ఈ ప్రదర్శనలను విజయవంతం చేసిన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.