
పయనించే సూర్యుడు న్యూస్: జనవరి/20: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్: సాయిరెడ్డి బొల్లం:మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండలంలోని గ్రామాల అభివృద్ధే ఏకైక లక్ష్యంగా సర్పంచులు పని చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం బెజ్జంకి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీవో కె.ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన సర్పంచులకు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సర్పంచులు రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేసి గ్రామాల అభివృద్ధి కోసం వార్డు సభ్యులతో కలిసి మెలిసి పని చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని, మంచినీటి సరఫరా, విద్యుత్ దీపాల పర్యవేక్షణ చేపట్టాలన్నారు. సర్పంచులకు సంపాదన కాకుండా ప్రజల మెప్పు పొందడటం ముఖ్యం కావాలన్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా పేరు నిలిచిపోయే విధంగా మంచి పనులు చేయాలని ఎమ్మెల్యే ఉద్భోదించారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు సర్పంచులు తోడ్పడాలని ఆయన కోరారు. రాజకీయాలకు అతీతంగానే గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కళ్యాణం శ్రీకాంత్, మండల పంచాయతీ అధికారి మంజుల, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ సౌజన్య తోపాటు వివిధ గ్రామాల సర్పంచులు హాజరయ్యారు.