పెద్ద తుంబలం గ్రామంలో పురాతన

★ జానకి కోదండ రామాలయం అపరిశుభ్రత – భక్తుల ఆవేదన

పయనించే సూర్యుడు జనవరి 20 ఆదోని ప్రతినిధి బాలకృష్ణ ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో ఉన్న దక్షిణ భారతదేశంలోనే అత్యంత పురాతనమైన, మహిమగల జానకి కోదండ రాముల స్వామి ఆలయం తీవ్ర అపరిశుభ్రతతో విలవిల్లుతోంది. నక్షత్ర ఆకారంలో నిర్మితమైన ఈ ప్రసిద్ధ దేవాలయం అనేక సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రంగా పేరు గాంచింది. అయితే, ప్రస్తుతం ఆలయం ముందు, ప్రక్కన మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో గలీజు దిబ్బలు, చెత్త చెదారం, అనవసర వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఈ దుర్గంధం కారణంగా ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ఈ అపరిశుభ్ర వాతావరణం వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు, ముఖ్యంగా చిన్న పిల్లలకు అంటు రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.ఈ విషయమై గ్రామ ప్రజలు పలుమార్లు స్పందన కార్యక్రమాల ద్వారా సబ్ కలెక్టర్ కి, గ్రామ సచివాలయ సిబ్బందికి, సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందజేసినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల భక్తులు, గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి, ఈ పవిత్ర దేవాలయ పరిసరాల్లో ఉన్న అపరిశుభ్రతను వెంటనే తొలగించి, దుర్వాసన లేకుండా శుభ్రపరిచి, ఆలయ పవిత్రతను కాపాడాలని భక్తులు మరియు గ్రామ ప్రజలు గట్టిగా కోరుతున్నారు.