సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు జనవరి 20 కరీంనగర్ న్యూస్: విడ్స్ స్వచ్చంద సంస్థ,ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం రోజున నగునూరు గ్రామ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి యుగంలో డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ సేవలు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయనీ, బ్యాంకింగ్, విద్య, వైద్యం,ప్రభుత్వ సేవలు అన్నీ ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చాయని, అయితే ఈ సౌకర్యాలతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్న దృశ్య ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థిక అక్షరాస్యత కేంద్రం మానకొండూర్, విడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై, అంక్లైమ్డ్ డిపాజిట్ల, సామాజిక భద్రత పథకాలపై అవగాహన కార్యక్రమం జరిగింది.. ముఖ్యంగా ప్రజలకు ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్ కాల్స్,నకిలీ లింకులు, ఓటిపి మోసాలు,సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాల గురించి వివరించారు. ముఖ్యంగా బ్యాంక్ వివరాలు,ఏటీఎం పిన్, ఓటీపీ వంటి గోప్య సమాచారాన్ని ఎవరికీ చెప్పకూడదని అవగాహన కల్పించారు.సైబర్ నేరాలు జరిగితే ఎవరిని సంప్రదించాలి,ఎలా ఫిర్యాదు చేయాలి అనే విషయాలపై కూడా స్పష్టమైన సమాచారం అందించారు. కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 , cybercrime.gov.in వెబ్‌సైట్ గురించి ప్రజలకు తెలియజేశారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు వంటి వర్గాలు సైబర్ నేరాలకు ఎక్కువగా గురవుతున్న నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజల్లో సైబర్ భద్రతపై చైతన్యం పెరిగింది. ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండి, అనుమానాస్పద కాల్స్ లేదా సందేశాలకు స్పందించకుండా ఉంటే సైబర్ నేరాలను నివారించవచ్చు అని ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ తొర్తి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సాగరిక, క్రాంతి కుమార్, గ్రామ పెద్దలు, గ్రామసర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *