రాచపల్లి – మల్లన్నపల్లి గ్రామాల్లో భక్తి ఉత్సాహం

★ శ్రీ గట్టు మల్లికార్జున స్వామి గంగ స్నానం ఖర్చులు ఐదేళ్లు భరిస్తానన్న సర్పంచ్ పసునూటి శ్రీనివాస్ ★ మార్చి 15 జాతరను విజయవంతం చేయాలని గ్రామ ప్రజలకు పిలుపు

పయనించే సూర్యుడు / మార్చి 5 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి – మల్లన్నపల్లి గ్రామాల్లో స్వయంభుగా వెలిసిన శ్రీ గట్టు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గంగ స్నానం, గంగపట్నం మహోత్సవాలకు సంబంధించిన వచ్చే ఐదు సంవత్సరాల ఖర్చులన్నీ తానే భరిస్తానని మల్లన్నపల్లి గ్రామ సర్పంచ్ పసునూటి శ్రీనివాస్ ప్రకటించారు. ఆయన ఈ ప్రకటనతో గ్రామ ప్రజల్లో ఆనందం నెలకొంది. సర్పంచ్ పసునూటి శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రీ గట్టు మల్లన్న స్వామి దేవాలయంలో నిర్వహించే గంగ స్నానం మహోత్సవం అత్యంత విశిష్టమైనదని తెలిపారు. అనాదిగా కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం స్వామివారి ఉత్సవ విగ్రహాలను పవిత్ర క్షేత్రమైన కాళేశ్వరానికి తీసుకెళ్లి గంగ స్నానం చేయించడం సంప్రదాయంగా వస్తోందని అన్నారు. గంగ స్నానం ద్వారా గ్రామానికి శాంతి, సౌభాగ్యం, సస్యశ్యామలం కలుగుతాయని భక్తుల నమ్మకం అని వివరించారు. ఈ పుణ్యయాత్రలో పాల్గొనే భక్తుల రవాణా, భోజన ఖర్చులను పూర్తిగా తన దాతృత్వంతో భరించనున్నట్లు సర్పంచ్ ప్రకటించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సుల ఏర్పాటు, తాగునీటి సదుపాయం, అన్నదానం, విశ్రాంతి ఏర్పాట్లు వంటి అన్ని విధాల సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌ను అభినందించారు. శ్రీ గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాచపల్లి – మల్లన్నపల్లి గ్రామాల భక్తులు తమకు తోచిన విధంగా స్వామివారికి సహాయం అందిస్తూ, మార్చి 15న నిర్వహించనున్న జాతరను విజయవంతం చేయాలని పసునూటి శ్రీనివాస్ కోరారు.