పయనించే సూర్యుడు మార్చి 05, ( చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) ఖమ్మం జిల్లా చింతకాని మండలం చింతకాని గ్రామానికి చెందిన యువకుడు నారపోగు రామకృష్ణ వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఎంపికై, హైదరాబాదులోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రోన్ రిమోట్ పైలెట్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజేంద్రనగర్లో పీజేటీయూ డ్రోన్ అకాడమీ నిర్వహించిన సిద్ధాంత, ప్రాయోగిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శిక్షణలో వ్యవసాయంలో డ్రోన్ వినియోగం, ఎరువులు మరియు పురుగుమందుల పిచికారీ విధానాలు, భద్రతా నియమాలు, నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.శిక్షణ అనంతరం నిర్వహించిన తుది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన రామకృష్ణకు ఖమ్మం జిల్లా కలెక్టర్ దురిసెట్టి అనుదీప్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి ఆధునిక శిక్షణలు రైతులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.ఆధునిక వ్యవసాయ సాంకేతికతను గ్రామ స్థాయిలో విస్తరించి ఇతర రైతులకు దోహదపడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు రామకృష్ణ తెలిపారు. ఆయన సాధన చింతకాని గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.