జహీరాబాద్ పట్టణంలో వెంటనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి – ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం డిమాండ్

పయనించే సూర్యుడు మార్చ్ 6 (జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) జహీరాబాద్ పట్టణం శీఘ్రగతిన విస్తరిస్తున్న నేపథ్యంలో, పెరుగుతున్న జనాభా మరియు వాహన రద్దీకి అనుగుణంగా వెంటనే ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీలో శివారు గ్రామాలు విలీనం కావడం వల్ల పట్టణ జనాభా సుమారు 1,30,000 కు పెరిగిందని, జహీరాబాద్ ఇప్పుడు ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా మారిందని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం వల్ల నిత్యం భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయని, దీనివల్ల ట్రాఫిక్ నిర్వహణ కష్టతరంగా మారిందని పేర్కొన్నారు. పట్టణంలో భారీ వస్త్ర వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు పెరగడం.. అలాగే నీమ్జ్ వల్ల కొత్త పరిశ్రమలు వస్తుండటంతో ఇతర ప్రాంతాల ప్రజల తాకిడి విపరీతంగా పెరిగిందని వివరించారు. గతంలో అనేకమార్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కావాలని కోరినప్పటికీ, ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుతం ఉన్న పోలీస్ సిబ్బంది పెరిగిన రద్దీని నియంత్రించలేకపోతున్నారని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్, ఎస్.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.