పయనించే సూర్యుడు మార్చి 5 రాజేష్ దౌల్తాబాద్, మార్చి 4: దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో రోజు వారి పారిశుద్ధ్య కార్యక్రమం ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించేందుకు ఉప సర్పంచ్ గడ్డం నాగరాజు చొరవ చూపారు. గ్రామ ట్రాక్టర్ డ్రైవర్ అనివార్య కారణాలతో హాజరుకాలేకపోవడంతో చెత్త సేకరణ పనులు నిలిచిపోకుండా ఉండేందుకు ఆయన స్వయంగా ట్రాక్టర్ నడిపి చెత్తను స్వీకరించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఇళ్ల వద్ద నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించారు. ప్రతిరోజు నిర్వహించే పారిశుద్ధ్య కార్యక్రమం గ్రామ ఆరోగ్యానికి ఎంతో కీలకమని భావించిన ఉప సర్పంచ్, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండకూడదనే ఉద్దేశంతో ముందడుగు వేశారు.
ఈ సందర్భంగా ఉప సర్పంచ్ గడ్డం నాగరాజు మాట్లాడుతూ, గ్రామ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత,డ్రైవర్ రాకపోయినా పనులు ఆగిపోకూడదనే ఉద్దేశంతో ట్రాక్టర్ నడిపానని గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. గ్రామ ప్రజలు ఉప సర్పంచ్ సేవా భావాన్ని అభినందిస్తూ, ప్రజాప్రతినిధులు ఇలా ముందుండి పనిచేయడం ఆదర్శనీయమని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.