ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం విజయవంతం చేయాలిఅధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించిన

★ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

పయనించే సూర్యుడు మార్చి 6 కరీంనగర్ న్యూస్: ఈనెల 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు జిల్లాలో చేపట్టనున్న “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమ నిర్వహణకు జిల్లాలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై గురువారం కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐదు దశల్లో 99 రోజులపాటు "ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమ నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సంసిద్ధం కావాలన్నారు. శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఏప్రిల్ 2న గ్రామస్థాయిలో గ్రామసభలు నిర్వహించాలని తెలిపారు. ఏప్రిల్ 16న మండల స్థాయి, మే 2న నియోజకవర్గ స్థాయి, మే 22న జిల్లాస్థాయిలో కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఈ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేకూరుస్తున్న లబ్ధి, వివిధ పథకాల గురించి వివరించాలని తెలిపారు. శాఖల వారీగా 10 వారాలపాటు అమలు చేసే ప్రత్యేక కార్యాచరణను పరిశీలించి పలు సూచనలు చేశారు శాఖల వారీగా 10 రకాల అంశాలతో 99 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి ప్రణాళిక శాఖ నోడల్ గా వ్యవహరిస్తుందని తెలిపారు. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైల్ క్లియరెన్స్, ఆరోగ్యం, అరైవ్-అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత- మత్తు పదార్థాల నిర్మూలన, రైతు సంక్షేమం- వ్యవసాయం, విద్య, యువత- క్రీడలు, మహిళలు పర్యావరణం అంశాల్లో నిర్వహించిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ ను పరిశీలించారు ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మి కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఆర్డీవో మహేశ్వర్, ముఖ్య ప్రణాళిక అధికారి రామ్ దత్తారెడ్డి, జడ్పీ సీఈవో శ్రీనివాస్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.