ముల్కనూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి..

★ బిజెపి మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్..

పయనించే సూర్యుడు మార్చి 06 భీమదేవరపల్లి:- ముల్కనూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టాలని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు శ్రీరామోజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ముల్కనూర్ గ్రామంలోని వివిధ సమస్యలపై బిజెపి నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ముల్కనూర్ గ్రామంలో ఆసుపత్రి నిర్మాణం కోసం 6 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ, నేటికీ కాంపౌండ్ వాల్ నిర్మించలేదన్నారు. కాంపౌండ్ వాల్ లేకపోవడంతో ఈ భూమి కబ్జాకు గురవుతోందని, వివిధ రాజకీయ పార్టీల జెండాలు పాతడం సరికాదని తెలిపారు. ప్రభుత్వ భూములు లేనట్లుగా కావాలనే హాస్పిటల్ స్థలంలో రైతు వేదిక,ఓపెన్ జిమ్ నిర్మించారని ఆరోపించారు. మిగిలిన స్థలం మురికి కుంటగా మారి దుర్వాసన వస్తుందని, దీనివల్ల సమీపంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు, గ్రంధాలయానికి వచ్చే అభ్యర్థులు, కూరగాయల మార్కెట్ కు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మార్కెట్ వద్ద మటన్, చికెన్ షాపుల వ్యర్థాలను కుంటలో వేయడం వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తెలిపారు. తక్షణమే ఆ మురికి కుంటను తొలగించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే హాస్పిటల్ కు నిధులు కేటాయించి, కాంపౌండ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకుంటామని, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్, నాయకులు దొంగల వేణు, బొజ్జపురి పృథ్వి, బైరి సదానందం, ముద్దసాని వీరన్న, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.