వాల్మీకులకు ప్రాంతీయ విబేధం తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చండి బీటి నాయుడు

* ఉపాధి అవకాశాలకొరకు వాల్మీకులు అనేక ఇబ్బందులు * మాకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించండి మా జాతి మీకు రుణపడి ఉంటాం కౌన్సిల్‌లో ఎమ్మెల్సీ బీటీ.నాయుడు విజ్ఞప్తి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 06, 2026 గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ రాష్ట్రంలో వాల్మీకి సమాజం ఎదుర్కొంటున్న ప్రాంతీయ వర్గీకరణ సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ బీటీ.నాయుడు రాష్ట్ర శాసన మండలిలో ప్రస్తావించారు. రాష్ట్రంలోని వాల్మీకులు కొన్ని జిల్లాల్లో షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ)లుగా గుర్తింపు పొందగా, మరికొన్ని జిల్లాల్లో బీసీ–ఏ వర్గంలో కొనసాగుతున్నారు. ఈ ప్రాంతీయ విభేదం కారణంగా వాల్మీకి యువతకు విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే ఈ సమస్యను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత టీడీపీ ప్రభుత్వ హయంలో అసెంబ్లీ నందు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న తీర్మానం ఆమోదించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఆ తీర్మానం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రంతో సమన్వయం చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వాల్మీకులపై ఉన్న ఈ ప్రాంతీయ బేధాన్ని తొలగించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ బీటీ.నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి తక్షణ చర్యలు తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *