మొక్కజొన్న రైతుల సమస్యలపై తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా

పయనించే సూర్యుడు మార్చి 07, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : మొక్కజొన్న సాగు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చింతకాని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద మొక్కజొన్న రైతుల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ పలు డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.మార్చి 15 లోపల ప్రతి గ్రామంలో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లైసెన్స్ లేకుండా గ్రామాల్లో వ్యాపారం పేరుతో రైతుల వద్ద పంట కొనుగోలు చేసి నగదు చెల్లించకుండా మోసం చేసే మధ్యవర్తులను కట్టడి చేయాలని రైతులు కోరారు. అలాగే ఎలాంటి పరిమితులు విధించకుండా రైతులు పండించిన మొత్తం మొక్కజొన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ధర్నా అనంతరం రైతులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని చింతకాని మండల తహసీల్దార్‌కు అందజేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ రైతులు వినిపించిన సమస్యలు, డిమాండ్లను జిల్లా కలెక్టర్‌కు పంపిస్తామని హామీ ఇచ్చారు.ఈ ధర్నాలో ఐక్య రైతు సంఘం జిల్లా నాయకులు కోలేటి నాగేశ్వరావు, మొక్కజొన్న రైతు కమిటీ అధ్యక్షుడు కూచిపూడి విజయ్‌కుమార్, రైతు సంఘ ఉపాధ్యక్షుడు పోలూరి మోహన్‌రావు, కార్యదర్శి నాగయ్య నారపోగు, సహాయ కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.అలాగే వివిధ గ్రామాల నుంచి కమిటీ సభ్యులు బూర వెంకట్రావు, పోలూరి ప్రభాకర్, ఖాజామియా, బాబు, మహేష్, వాసు, వెంకటేశ్వర్లు, రామయ్య, గోవిందు, రామారావు, నరసింహారావు, నాగేశ్వరావు, నాగ శ్రీనివాస్, గోవిందు, కోటయ్య, వెంకటరావు, వీరబాబు, రాంబాబు, కోటేష్ తదితర రైతులు పాల్గొన్నారు.