రాఘవపురంలో పోస్ట్ ఆఫీస్ సేవలపై అవగాహన సమావేశం

పయనించే సూర్యుడు మార్చి 07, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండలం రాఘవపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో డిటి డిసి కార్యక్రమంలో భాగంగా పోస్ట్ ఆఫీస్ సేవలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కోటమ్మ అధ్యక్షత వహించారు. ఖమ్మం పోస్ట్ ఆఫీస్ సూపరింటెండెంట్ వీరభద్ర స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉన్న వివిధ పోస్ట్ ఆఫీస్ సేవలు, పథకాల గురించి వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే ఇన్సూరెన్స్ పథకాలు, ఆడపిల్లల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి పథకం, మగ పిల్లలు మరియు వృద్ధులకు ఉపయోగపడే వివిధ పొదుపు పథకాలు, సేవింగ్స్ అకౌంట్ల గురించి వివరించారు. అలాగే భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణానికి సంబంధించిన తలంబ్రాలను పోస్ట్ ఆఫీస్ ద్వారా బుక్ చేసుకునే వారికి వారి ఇంటిపేరు, గోత్రనామాలతో అభిషేకం చేయించి ఇంటికే పంపించే సౌకర్యం ఉందని తెలిపారు.గ్రామ ప్రజలు తమ అవసరాల దృష్ట్యా వారానికి ఒకరోజు రాఘవపురం గ్రామంలో పోస్ట్ ఆఫీస్ సేవలు అందుబాటులో ఉంచాలని పంచాయతీ తరఫున కోరగా, దీనికి సానుకూలంగా స్పందించిన సూపరింటెండెంట్ వీరభద్ర స్వామి వారానికి ఒకరోజు గ్రామంలో పోస్ట్ ఆఫీస్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో పోస్ట్ ఆఫీస్ సేవలు ప్రతి ఒక్కరికీ సులభంగా అందుబాటులో ఉండేలా ప్రయత్నిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ నరసింహ, పంచాయతీ కార్యదర్శి సురేష్, ఉపసర్పంచ్ అబ్బూరి మహేష్, వార్డ్ సభ్యులు దొబ్బల నరసింహారావు, వడ్లమాని రాంబాబు, కాంపల్లి రమేష్, సింగారపు నాగమ్మ, వడ్డే నిరోషా, మేడ నాగేశ్వరి, కోడుమూరు బ్రాంచ్ ఎం. రాంప్రసాద్, టి. పుల్లారావు, సిహెచ్. రామయ్య తదితరులు పాల్గొన్నారు.