పయనించే సూర్యుడు మార్చి 7 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న TSSPDCL కార్యాలయం ఎదుట మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ మహాధర్నా నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో జేఏసీ నాయకులు మిద్దె శ్రీనివాసులు ఆధ్వర్యంలో మహాధర్నాకు మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. పెద్ద ఎత్తున కార్మికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేసి ఉద్యమానికి ఐక్యంగా నిలుస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జేఏసీ నాయకులు రాష్ట్రంలో 2017 సంవత్సరంలో నియమించబడిన ఆర్టిజన్ కార్మికులు ఇప్పటివరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం అప్పట్లో ఇచ్చిన హామీలను ఇప్పటికీ పూర్తిగా అమలు చేయకపోవడం వల్ల కార్మికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ముఖ్యంగా రెగ్యులర్ పే స్కేల్ అమలు చేయడం, అర్హత కలిగిన వారికి పదోన్నతులు కల్పించడం, ఉద్యోగ భద్రత కల్పించడం వంటి ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ఆర్టిజన్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పగలు రాత్రి తేడా లేకుండా సేవలు అందిస్తున్నప్పటికీ వారికి సరైన గుర్తింపు, వేతనాలు, సౌకర్యాలు లభించకపోవడం విచారకరమని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో విద్యుత్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న మహాధర్నాకు నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి భారీ సంఖ్యలో ఆర్టిజన్ కార్మికులు తరలివెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో జిల్లా జేఏసీ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు.
